కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు..! రామచందర్ రావు షాకింగ్ కామెంట్స్..!

బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్. రామచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తోందని కొనియాడారు.

2014కు ముందు దేశంలో అనేక కుంభకోణాలు చూశామని, మోదీ ప్రధాని అయ్యాక దళారీ వ్యవస్థను అంతమొందించి లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. గడిచిన 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 41 రైల్వే స్టేషన్లను ఆధునీకరించినట్లు చెప్పారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్ వేస్ రవాణా వ్యవస్థలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.

గోవాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాముడు కాదని.. ఆ పార్టీ రావణుడు, రాక్షసుడు అవుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు అంటూ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ‘కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాముడి పేరు ఎత్తడం విడ్డూరంగా ఉందన్నారు. హిందువుల భావోద్వేగాలతో ఆడుకోవద్దని, దేవుళ్లను ఎగతాళి చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉండి ప్రాణాలు వదులుతుంటే, ముఖ్యమంత్రి , మంత్రులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ‘ఫసల్ బీమా యోజన’ను అమలు చేసి రైతులను ఆదుకోవాలని, లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రబిందువుగా మారుతోందని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి రాజకీయ డ్రామాలుడుతున్నారని రామచందర్ రావు విమర్శించారు.