సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలు చేశారంటూ దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన భారీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకూ తలపెట్టిన ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నిరసనకారులతో కలిసి సీఎం నడిచారు. ఎస్ఐఆర్ ముసుగులో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడంతో దిల్లీలో హైటెన్షన్ వాతావారణం ఏర్పడింది.

అంతకుముందు ర్యాలీలో పాల్గొనేముందు సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఓటు హక్కును కల్పించడానికి ఎస్ఐఆర్ చేపట్టారి.. ఇప్పుడు తొలగించడానికి ఈ ప్రక్రియను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన అధికారం నిలబెట్టుకోవడానికి గతంలో ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వాటితో పెద్దగా పని జరగడం లేదని భావించి.. ఏకంగా ఎన్నికల కమిషన్ ను పావుగా వాడుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేకుల ఓఠ్లను తొలగించేందుకు ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని తేలినా.. ఆయన్ను పదవి నుంచి ఎందుకు తప్పించలేదని ప్రధాని మోదీని నిలదీశారు.