వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి కమిషనరేట్ స్థాయి అధికారుల వరకు రైతులకు ఇప్పటికే వ్యవసాయ విస్తరణ సేవలు అందుతున్నాయి. వీటికి అదనంగా, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే సలహాలు పొందేందుకు వీలుగా కిసాన్ హెల్ప్లైన్ సెంటర్ (కేహెచ్సీ) మరో ముందడుగుగా నిలుస్తోంది. పంటకు తెగులు సోకినా, ఎరువు ఎంత వేయాలో తెలియకపోయినా, ప్రభుత్వ పథకం అందకపోయినా రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551 కు ఫోన్ చేస్తే చాలు. తెలుగులోనే తక్షణ సలహా, సమాచారం అందుతాయి. సేవలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, వారంలో 7 రోజులూ అందుబాటులో ఉంటాయి. కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ కేంద్రం, తెలంగాణ రైతుల కోసం హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకుల కార్యాలయంలో పనిచేస్తోంది.
శాస్త్రవేత్తల మార్గదర్శకత్వం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు ,సందేహాల నివృత్తి, పంటలు, విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సాగు పద్ధతులపై సలహాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెట్ ధరలు, పశు ఆరోగ్యం, పోషణపై సూచనలు, వాతావరణ శాఖ సూచనల మేరకు హెచ్చరికలు, కేంద్ర ఎరువుల యాప్ కు సంబంధించిన సాంకేతిక సందేహాల నివృత్తి. సలహాలతో పాటు, వ్యవసాయ పథకాలకు సంబంధించిన రైతుల ఫిర్యాదులను కూడా ఇదే నంబర్ ద్వారా తెలియజేయవచ్చు. “రైతుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” ఇదే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉండగా, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్రం సహాయపడుతుంది.
కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ తో అందజేసే సేవలు మారుమూల గ్రామాల్లోని ప్రతి రైతుకూ తెలిసేలా, క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), మండల వ్యవసాయ అధికారులు (ఎంఏఓలు) విస్తృతంగా అవగాహన కల్పించాలి. రైతులు తమ సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ సెంటర్ వారం రోజులు అందుబాటులో ఉంటుంది.