సీఎం జగన్ తీరుపై ఎమ్మెల్యేల సీరియస్..

ఉన్న చోట పనితీరు బాలేదనో? అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయనో? ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుందనో? ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ పలువురు సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేకుండా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఖరికి మంత్రుల నియోజకవర్గాలు మారుస్తున్నారు. అలా స్థాన చలనం కలిగిస్తుండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అధినేత నిర్ణయాలపై మింగలేక కక్కలేక పోతున్న ప్రజాప్రతినిధులు పలువురు లోలోపల మధన పడుతుంటే.. ఇప్పటికే కొందరు జగన్‌పై ధిక్కార స్వరం వినిపిస్తూ.. తమ దారి తాము చూసుకుంటున్నారు.

 

వైసీపీ ఆవిర్భావం నుంచి తన ఛరిష్మా.. తన ఫేస్ ఇమేజ్‌తోనే పార్టీలో అందరూ గెలుస్తున్నారన్న నమ్మకం జగన్‌లో కనిపించేదంటారు. ఇక అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ మరింత పెరిగిపోయినట్లు కనిపించాయి. అయితే ఆ నమ్మకాన్ని జగన్ కోల్పోయినట్లు కనిపిస్తోందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. తన ఫొటో ఉంటే చాలు గెలిచేస్తారని నమ్మకం ప్రదర్శించే జగన్.. అభ్యర్ధులకు మీ సీటు మీరే గెలుచుకోవాలని చెప్తుండటంపై పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

అలా అని సిట్టింగుల మీద ఆయనకు భరోసా ఉంచకపోతుండటంపై వైసీపీలో పెద్ద చర్చే జరుగుతోంది. స్థానచలనం కలిగించిన వారికి నియోజకవర్గంలో మీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కనుక మిమ్మల్ని మార్చేసి.. మరొకరికి అవకాశం ఇస్తున్నానని చెబుతున్నారు జగన్. అయితే అలా సెగ్మెంట్లు షిఫ్ట్ అవ్వాల్సిన వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. తమ అధినేత పూర్తిగా యూటర్న్ తీసుకున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో పని చేసుకోనీయకుండా చేసి.. మీరేం చేయక్కర్లేదు గడపడగపకు వెళ్లి నేను చేసింది చెప్పండి చాలు.. నా ఫొటోయే మిమ్మల్ని గెలిపిస్తుంది. అన్నట్లుగా ఇంత కాలం వ్యవహరించిన జగన్ ఇప్పుడు హఠాత్తుగా మీకు మీమీ నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలు లేవు, అందుకే గెలుపు గుర్రాలను తీసుకువస్తున్నాననడం ఏమిటని నిలదీస్తున్నారు.

 

ప్రభుత్వ వ్యతిరేకతను సిట్టింగులకి ఆపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుండి గెలిపించలేనని చేతులెత్తేసిన నేత వెనుక ఎందుకు ఉండాలని కొందరు తిరుగుబాటు చేయడం కూడా మొదలుపెట్టారు. ఇంత కాలం అధినేత మాటే శిరోధార్యం అన్నట్లుగా ఉన్న ఒక్కొక్కరూ ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఎందుకు మారుస్తున్నారంటూ నిలదీస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ముందే ధర్నాలకు దిగుతున్నారు. టికెట్ దక్కని వారు ఒకందుకు బాధపడుతుంటే.. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాదని.. మరో సెగ్మెంట్‌కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిన వారురెండింతలు బాధపడుతున్నారు. తమను అవినీతి పరులుగా, చేతకానివారిగా చిత్రీకరించి మరీ నియోజకవర్గం మార్చేస్తున్నారని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ టికెట్ నిరాకరించి పక్కన పెట్టేసిన వారు జగన్ దగా చేశారని బాధపడుతుంటే.. సొంత నియోజకవర్గంలో మీరు గెలిచే చాన్స్ లేదు.. అంటూ మరో నియోజకవర్గానికి జగన్ బదిలీ చేసిన వారు బయటకు చెప్పుకోలేక తెగ ఇదై పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత సాకు చూపి మార్చేయడమంటే..తమ మీద అవినీతి ముద్ర వేయడమేనని రగిలిపోతున్నారు. ఇలా మార్చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటం కొసమెరుపు.. సొంత కేబినెట్ సహచరులే నియోజకవర్గంలో పట్టు సాధించడంలోనూ, ప్రజా మన్నన పొందడంలోనూ విఫలమయ్యారని స్వయంగా జగన్ చెబుతుండటంతో.. నియోజకవర్గం మారితే మాత్రం అక్కడ పార్టీ కేడర్ సహకారం ఎలా ఉంటుందని.. ప్రజలు నమ్మి ఎలా ఓట్లేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

సొంత నియోజకవర్గంలోనే పనికిరానివారిగా పార్టీ అధినేత ముద్ర వేసి మరో నియోజకవర్గానికి పంపిస్తే.. అక్కడి పార్టీ క్యాడర్, జనం .. పనికి రానివారు మాకెందుకని దూరంపెట్టరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు తమ ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎలాగా ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇక ప్రచారానికి సొమ్ములు తగలేసుకోవడం ఎందుకు అన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కొందరైతే మీరు టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు. మేం మొత్తంగా పోటీకే దూరంగా ఉంటాం కానీ .. నియోజకవర్గం మాత్రం మారమని నిర్మొహమాటంగా జగన్ కే ముఖం మీద చెప్పేస్తున్నారు.

 

మొత్తమ్మీద టికెట్ దక్కి నియోజకవర్గం మారిన వారు.. టికెట్ దక్కని వారూ.. ఆశించి భంగపడ్డవారు ఇలా అందరిలోనూ పార్టీ పట్ల, అధినేత జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే వారిలో పలువురు.. క్యాడర్, పార్టీ నేతల సహకారం ఉండదని నిర్ణయించుకునే.. రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికి రెండు లిస్టులు ప్రకటించి.. 38 మంది ఇన్‌చార్జులను మాత్రమే మార్చారు జగన్. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో అన్న గుబులు కనిపిస్తోంది పార్టీ శ్రేణుల్లో.. మరి వైనాట్ 175 మంత్రం పఠిస్తున్న జగన్.. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏ మంత్రం వేస్తా

రో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *