గత రెండు మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటూ అభిమానులను ఊరిస్తూ.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాని విశ్వంభర (Vishwambhara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా వాయిదా పడుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వాస్తవానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా.. గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల నిరంతరం ఆలస్యం అవుతూ రావడమే దీనికి ప్రధాన కారణం. ఒకానొక దశలో ఈ సినిమా ఇక రాదు అనే రూమర్లు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ పై రోజుకో వార్త చెక్కర్లు కొట్టడం గమనార్హం.
ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ రేస్ లో దింపుతామని మేకర్స్ చెబుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకకు రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. 2027 మార్చిలో మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫాంటసీ డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశం కావడంతో శివరాత్రి సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరిలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ తన కొత్త చిత్రం కాకా తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా సందడి ముగిసిన తర్వాతే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కనీసం ఈ తేదీకి అయినా కన్ఫామ్ అవ్వాలని , అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫాంటసీ వండర్ గ్రాండ్ విడుదల ఎప్పుడు ఉంటుందో.. మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మరో చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా చేశారు. ఈ సినిమా తర్వాత విశ్వంభర సినిమాను విడుదల చేస్తే, ఆ సినిమా ఫలితం ఈ సినిమాపై పడుతుందని, ఫలితంగా మార్కెట్ పెరిగి కలెక్షన్స్ వస్తాయని చిరంజీవి ప్లాన్ చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. ప్లాన్ ప్రకారమే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విడుదలయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయినా విశ్వంభర రాలేదు. ఈ సినిమాను పక్కన పెట్టి ‘కాకా’ సినిమా షూటింగ్లో కూడా చిరంజీవి శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతోంది.
మరి ఇప్పటికైనా విశ్వంభరను రిలీజ్ చేస్తారా ? ఇంకా వాయిదాలతోనే సరిపెడతారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా విశ్వంభర లాంటి సోషియో ఫాంటసీ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. కార్తీక్ శబరీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ప్రొడ్యూసర్ గా సుస్మిత కొణిదెల వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది.