అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి..! అధికారులకు సీఎస్ ఆదేశం..!

ఎల్-నినో ప్రభావంతో కరువు పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని, అక్టోబర్ మాసాంతంలోగా నివేదిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరువు పరిస్థితులపై ప్రణాళిక, రెవెన్యూ, గ్రౌండ్ వాటర్, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి సరఫరా తదితర శాఖల నుంచి సమగ్ర వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం కరువు ప్రభావిత మండలాలను గుర్తించాలని ఆదేశించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో నమోదైన వర్షపాతం సహా 12 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర కరువు నివేదికను రూపొందించాలని సూచించారు.

ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని కరువు ప్రభావిత మండలాలను ప్రకటించే ప్రక్రియను చేపట్టాలని, ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అక్టోబర్ మాసాంతంలోగా సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఎల్-నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఆ సమావేశానికి అవసరమైన అన్ని వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను కోరారు.