ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ దశ, దిశ మార్చడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రొద్దుటూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి ఇక్కడి నుంచే పొద్దుపొడుపు అవుతుందని అన్నారు. ఈ సభ వేదికగా రూ.30,156 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మక ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0) పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, పలు కీలక అంశాలపై ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరారు.
గ్రామీణ తాగునీటి కష్టాలకు ‘అమరజీవి జలధార’తో చెక్
సభలో చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ రోజు ప్రొద్దుటూరులో ఈ బృహత్కార్యక్రమాన్ని ప్రారంభించాం. తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ఈ పథకానికి ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టాం. నీళ్లు తాగిన ప్రతిసారీ ఆయన త్యాగం గుర్తుకురావాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మహిళల నీటి కష్టాలు తీరడంతో పాటు వారి శ్రమ, సమయం, ఖర్చు ఆదా అవుతాయి” అని వివరించారు. గత ప్రభుత్వం కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందని, ఇతర రాష్ట్రాలు వేల కోట్లు వినియోగించుకుంటే, గొడ్డలి పార్టీ కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.
రాయలసీమ దశ మార్చేస్తాం.. రత్నాల సీమగా తీర్చిదిద్దుతాం
రాయలసీమ అభివృద్ధిపై తనకున్న దార్శనికతను వివరిస్తూ, “ఒకప్పుడు కరువు సీమ, రాళ్ల సీమగా పిలిచిన ఈ ప్రాంతాన్ని రత్నాల సీమగా, దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాం. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్‌గా తయారు చేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. రెండేళ్లలో రూ.24,000 కోట్లు ఖర్చు చేశాం. గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే. తేడా మీరే గమనించండి” అని అన్నారు.
“రాయలసీమలో కేవలం హార్టికల్చర్ మాత్రమే కాదు, రాబోయే రెండేళ్లలో నెలకు రెండు శాటిలైట్లను ఇక్కడి నుంచే ప్రయోగించేలా స్పేస్ టెక్నాలజీ, పుట్టపర్తి నుంచి శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టించే ఐదో తరం ఫైటర్ జెట్‌లను తయారు చేసే ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ వంటి ఎన్నో పరిశ్రమలు రానున్నాయి. ఒకప్పుడు స్వర్ణగిరిగా పిలిపించుకున్న జొన్నగిరిలో మళ్లీ బంగారు గనులు వచ్చాయి. రాయలసీమ సత్తా ఇది. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి. బుల్లెట్ రైళ్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ కూడా ఇక్కడికే వస్తుంది. ఈ ప్రాంత యువత బుల్లెట్‌లా దూసుకుపోవాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ నాయకత్వంలో పల్లెల ప్రగతి
కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును చంద్రబాబు ప్రశంసించారు. “నా మిత్రుడు పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధికి కొత్త రూటు వేశారు. మరెక్కడా లేని విధంగా పవన్ కల్యాణ్ రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టించారు. ఆయన నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల తర్వాత 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. పంచాయతీలకు రూ.4,136 కోట్ల నిధులు విడుదల చేయించాం. లక్షకు పైగా పంట కుంటలు, గోకులాలు ఏర్పాటు చేశారు. ఆయన నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం” అని ప్రకటించారు.
గొడ్డలి పార్టీకి సూటి ప్రశ్నలు.. ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి
ఈ క్రమంలో గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. “ఈ కడప గడ్డ, ప్రొద్దుటూరు నుంచే సవాల్ విసురుతున్నా. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయింది. రూ.40 కోట్ల సుపారీ గుట్టు విప్పింది. దీనిపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు దోచిన అంతిమ లబ్ధిదారు కూడా నువ్వేనని అన్ని వేళ్లూ నీ వైపే చూపిస్తున్నాయి. సమాధానం చెప్పగలవా?” అని నిలదీశారు.
“ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు చేసి యువత జీవితాలతో ఆడుకున్నారు. ఇసుకను దోచుకున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం తెచ్చాం. మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉన్నాం. కానీ, వాళ్లు నేరాలు చేసి, ఆ నెపాన్ని ఎదుటివారిపై రుద్దడమే పనిగా పెట్టుకున్నారు. అదే వారి డీఎన్ఏ. వారికి అభివృద్ధి సిద్ధాంతం కాదు, కుట్రలు, హింసా రాజకీయాలే వారి సిద్ధాంతం” అని దుయ్యబట్టారు.
ప్రొద్దుటూరుకు వరాలు.. స్థానిక సమస్యలకు పరిష్కారం
స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కోరిక మేరకు ప్రొద్దుటూరు అభివృద్ధికి పలు వరాలు ప్రకటించారు. డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.35 కోట్లు, కొర్రపాడు రోడ్డు విస్తరణకు రూ.8 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ మార్కెట్ రీమోడలింగ్ పనులను త్వరలోనే పరిష్కరిస్తామని, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజోలి, అలగనూరు రిజర్వాయర్ల పనులను కూడా పూర్తి చేసి సాగునీటి సమస్యను తీరుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు
చివరగా, ప్రజల మద్దతును కోరుతూ, “కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలనతో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అప్పుడు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. కుట్ర రాజకీయాలను తిప్పికొట్టి, అభివృద్ధికి పట్టం కట్టండి,” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరైన ప్రజల ఉత్సాహాన్ని చూసి, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, “భారత్ మాతా కీ జై, తెలుగు తల్లికి జై” నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు.