‘చుట్టమల్లే’ ఏఐ వివాదం..! ఎన్టీఆర్ మాస్ వార్నింగ్..!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలను, వారి సినిమాలను, సినిమాలలోని పాత్రలను , వారి వ్యక్తిగత విషయాలను, వారి ఫోటోలను, వాయిస్ ను ఏ విధంగా ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు , తప్పుదోవ పట్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏఐ లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి మరీ చెత్తగా సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ (NTR ) హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను ఏ ఐ ద్వారా అసభ్యకరంగా సృష్టించడంపై.. ఏకంగా రంగంలోకి దిగారు ఎన్టీఆర్. ” ఎవరిని వదిలిపెట్టను” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు.

“చుట్టమల్లే వీడియో వెనుక ఉన్న నీచులారా , మీలో ఎవరిని నేను వదిలిపెట్టను. అసహ్యకరమైన రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య ఇది. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ గడ్డపై ‘మాతృదేవోభవ’ అనేది కేవలం ఒక మాట మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక భాగమైన ఈ దేశంలో కొందరు వ్యక్తులు ఎంతగా దిగజారిపోయారంటే.. ఒక స్త్రీని అత్యంత అవమానకరమైన రీతిలో అవమానించడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఇంతటి నీచమైన దాన్ని సృష్టించడానికి ఏ ఐ ను ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు.

ఈ మార్ఫింగ్ చేసిన చుట్టమల్లే వీడియో వెనుక ఉన్న నీచులారా మిమ్మల్ని నేను వదిలిపెట్టను. దీనిని సృష్టించిన వారిపైన, వ్యాప్తి చేస్తున్న వారిపైన కూడా సాధ్యమైనన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఇలాంటి కంటెంట్ ను చూడవద్దు.. పంచుకోవద్దు.. లేదా దానితో సంబంధం పెట్టుకోవద్దు. ఈరోజు మరొకరు.. రేపు అది మీ తల్లి , సోదరి, భార్య లేదా కుమార్తె కూడా కావచ్చు. ఇది ఒక తీవ్రమైన సమస్య.. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా, కఠినంగా వ్యవహరించి కఠినమైన నిబంధనలను తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను, భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు

ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో సమాజంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు అని హెచ్చరిస్తూ ప్రముఖులు, కోర్టులు కూడా కఠినంగా స్పందిస్తున్నాయి. సెలబ్రిటీలు తమ పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వంటి ప్రముఖ ధర్మాసనాలు కూడా గతంలో స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఎవరి అనుమతి లేకుండా వారి ఫోటోలు, పేర్లు లేదా వాయిస్ ని కమర్షియల్ లేదా తప్పుడు అవసరాల కోసం వాడకూడదని చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. అయినా సరే ఇంకా కొంతమంది ఆకతాయిలు ఇలా సెలబ్రిటీల ఫోటోలను, వీడియోలను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్ ను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వారి పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తన సినిమాలో పాటపై వచ్చిన వివాదంపై సీరియస్ గానే స్పందించారు. మరి దీనిపై ఆయన మునుమందు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.