ప్రపంచ స్పేస్ పవర్‌గా ఎదుగుతున్న భారత్..!

అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా దూసుకెళుతోంది. 1975లో ఆర్యభట్ట ప్రయోగంతో మొదలైన ప్రయాణం.. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్‌ దిశగా సాగుతూ ఇప్పుడు భారతీయ అంతరిక్ష కేంద్రం వరకు చేరింది. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలో కీలక అంతరిక్ష శక్తిగా ఎదుగుతోందని టాంజానియాకు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

చంద్రుడి నుంచి సూర్యుడి వరకు
2023లో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావడం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుడిపై పరిశోధనలు ప్రారంభించింది. స్పాడెక్స్ ప్రయోగంతో అంతరిక్షంలో రెండు వాహనాలను అనుసంధానం చేసే డాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

2024లో ఆమోదం పొందిన చంద్రయాన్-4 మరింత క్లిష్టమైన మిషన్. చంద్రుడిపై దిగడం, అక్కడి నుంచి మట్టి నమూనాలను సేకరించడం, వాటిని తిరిగి భూమికి తీసుకురావడం దీని లక్ష్యం. ఇందుకోసం ఒకటి కంటే ఎక్కువ ప్రయోగాలు, డాకింగ్, చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి పైకి రావడం వంటి సంక్లిష్ట దశలు ఉంటాయి.

శుక్రుడిపైనా భారత్ కన్ను
భారత్ గ్రహాంతర పరిశోధనలను కూడా విస్తరిస్తోంది. శుక్రయాన్ మిషన్‌ను 2028 మార్చిలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రుడి వాతావరణం, ఉపరితలం, భూగర్భ పరిస్థితులను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. మరోవైపు భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిత్య-ఎల్1 సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణాన్ని పరిశీలిస్తోంది.

గగన్‌యాన్.. మరో పెద్ద అడుగు
భారత్ అంతరిక్ష ప్రయాణంలో గగన్‌యాన్ కీలక ప్రాజెక్టుగా మారింది. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన జీవనాధార వ్యవస్థలు, అత్యవసర రక్షణ వ్యవస్థలు, పారాచూట్లు, తిరిగి భూమికి వచ్చే సాంకేతికతను భారత్ పరీక్షిస్తోంది. ముందుగా మానవరహిత ప్రయోగాల ద్వారా కీలక వ్యవస్థలను పరీక్షించి, ఆ తర్వాత వ్యోమగాములను పంపేలా దశలవారీగా ముందుకెళుతోంది.

అంతరిక్ష కేంద్రం.. చంద్రుడిపై మనిషి
భారతీయ అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్‌ను 2028లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్న ప్రణాళిక ఉంది. 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపే లక్ష్యాన్ని కూడా భారత్ నిర్దేశించుకుంది. ఉపగ్రహాల నుంచి వ్యోమగాములు, అంతరిక్ష కేంద్రం, అక్కడి నుంచి చంద్రుడి వరకు భారత్ ప్రణాళికలు విస్తరిస్తున్నాయని కథనం పేర్కొంది.

భూమిపైనా అంతరిక్ష సాంకేతికత ప్రభావం
భారత అంతరిక్ష కార్యక్రమం ప్రయోజనాలు అంతరిక్షానికే పరిమితం కావడం లేదు. వాతావరణ అంచనాలు, వ్యవసాయం, నావిగేషన్, సమాచార వ్యవస్థలు, విపత్తుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణలో ఉపగ్రహాలు కీలకంగా మారాయి. వరదలు, తుపానులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ముందుగానే గుర్తించడంలో ఉపగ్రహ చిత్రాలు ఉపయోగపడుతున్నాయి.

అడవులు, నీటి వనరులు, నగరాల విస్తరణ, కాలుష్యం, వాతావరణ మార్పులను పర్యవేక్షించడంలోనూ అంతరిక్ష డేటా ఉపయోగపడుతోంది. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు, విద్యను అందించడంలోనూ ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది.

అంతరిక్ష రంగంలో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, కమ్యూనికేషన్, నావిగేషన్, తయారీ సాంకేతికతలు ఇతర రంగాలకూ విస్తరిస్తున్నాయి. రైల్వే ఇంజిన్ల కోసం ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన 900కుపైగా అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు కొత్త సాంకేతికతలు, పరిశ్రమలు, నైపుణ్యాలు, వాణిజ్య అవకాశాలకు దారితీస్తున్నాయని కథనం పేర్కొంది.