హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భవానీ నగర్ కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం పూజలు జరుగుతుండగా ఒక వ్యక్తి అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భక్తులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి తన చేతిలోని కర్రలతో విగ్రహంపై దాడి చేయడం ప్రారంభించాడు. ఈ హఠాత్పరిణామాంతో భయాందోళనకు గురైన భక్తులు కేకలు వేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు, ఎల్బీ నగర్ ఏసీపీ రవీంద్ర రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడిని మహమ్మద్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అతను కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. నిందితుడు గర్భగుడిలోకి వెళ్లి విగ్రహంపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వాణిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఆలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.