కెప్టెన్ స్మిత్ కు ముంబైలో అరుదైన గౌరవం.. హోర్డింగులతో ఇజ్రాయెల్ కృతజ్ఞత..

విమానంలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను కొనియాడుతూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ముంబైలో భారీ హోర్డింగులను ఏర్పాటు చేసింది. ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్, కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించాడు. మెడ, చేతులపై తీవ్ర గాయాలైనప్పటికీ, స్మిత్ ధైర్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ నొక్కి కాక్‌పిట్ డోర్ తెరిచారు. దీంతో ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కలిసి సహ పైలట్‌ను అడ్డుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. 

ఆ విమానంలో 27 మంది చిన్నారులతో సహా అత్యధికులు ఇజ్రాయెల్ పౌరులే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ముంబైలోని పలు ప్రధాన ప్రాంతాల్లో “థ్యాంక్యూ, కెప్టెన్ స్మిత్, ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. మీరు త్వరగా కోలుకోవాలి” అనే సందేశంతో ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ మాట్లాడుతూ.. స్మిత్ భారత్, ఇజ్రాయెల్ రెండింటికీ హీరో అని కొనియాడారు. స్మిత్ పూర్తిగా కోలుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా సత్కరిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం కెప్టెన్ స్మిత్ తబుక్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అరెస్ట్ చేసి యూఏఈకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భారత ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి పలువురు నేతలు ఇప్పటికే స్మిత్ ధైర్యాన్ని ప్రశంసించారు.