తెలంగాణలో రాజకీయాలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా శివుడు పేదల దేవుడు.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.
ఢిల్లీలో ఓ ఈవెంట్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టారు. శివుడు వేరు శ్రీరాముడు వేరని వ్యాఖ్యలు చేయడం తగదని, ఈ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంతోపాటు యావత్త దేశం ఛీదరించుకునేలా ఉందన్నారు.
సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలను అన్ని విధాలుగా విభజించే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఉత్తర దేశం వేరు, దక్షిణ భారత్ వేరంటూ ప్రజల మధ్య వైషమ్యాలను స్పష్టించేందుకు స్వాతంత్ర్య కంటే ముందు నుంచి మొదలుపెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో మెజార్టీ హిందూ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశారన్నారు.
హిందూ సమజంలోని ప్రజలు అన్ని దేవుళ్లను పూజిస్తారని, కొందరు వ్యక్తి గతంగా పూజించవచ్చన్నారు. ఇలాంటివి అవసరమా? అంటూ ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీ పార్లమెంటులో శివుడు ఫోటో చూపించి ఇదే విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు అమలు చేయకుండా రోజుకో కొత్త నాటకం, డ్రామా, కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ఏ విధంగా అయితే 10 ఏళ్లు నాటకాలు ఆడారో, వీరు అదే విధంగా నాటకాలు ఆడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల దేవుళ్లపై ఈ విధంగా మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.