రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కొత్త ఛార్జీ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చార్జీల విధానం, దాని ప్రాతిపదికపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది. అయితే కేంద్రం నుంచి సమాధానం వచ్చే వరకూ ఎండీఆర్ ఉత్తర్వులపై మాత్రం స్టే విధించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
యూపీఐ ఎండీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా అడ్వకేట్ అంజన్ దత్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్నలపై కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. యూపీఐ వినియోగదారుల్లో 96 శాతం మందిపై ఈ కొత్త చార్జీల ప్రభావం ఉండదని, వారంతా మినహాయింపు పరిధిలోనే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, అమలు విధానం, సాంకేతిక అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రంతో పాటు RBI, NPCIకి ఉత్తర్వులు పంపింది. అదే సమయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ యాప్‌లకు వ్యాపారులు చెల్లించే రుసుమునే ఎండీఆర్ అంటారు. అయితే గత ఆరేళ్లుగా యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ చార్జీలు లేకుండా ప్రభుత్వం ఉచిత సేవలు అందించింది. అయితే కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే పెద్ద లావాదేవీలపై ఈ రుసుము గరిష్టంగా రూ.300 వరకు పరిమితం చేశారు.
ఈ ఎండీఆర్ రుసుమును కేవలం వ్యాపారులకు మాత్రమే కేంద్రం పరిమితం చేసింది. డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులపై ఈ ఛార్జీల భారం ఉండదు. అంతేకాకుండా వ్యాపారులు ఈ చార్జీలను వినియోగదారులపై మోపకుండా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులకు సూచించింది. అలాగే యూపీఐ యాప్ ప్రొవైడర్లు ఎలాంటి హిడెన్ చార్జీలు గానీ, ప్లాట్‌ఫామ్ ఫీజులు గానీ వసూలు చేయకూడదని స్పష్టంగా ఆదేశించింది.