నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. రెండు రోజుల్లో 19 మంది మృతి..

నాగాలాండ్‌లో కల్తీ మద్యం అనుమానిత ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల్లో మద్యం సేవించిన తర్వాత 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొకోక్‌చుంగ్‌ జిల్లాలో 8 మంది, ట్యూన్‌సాంగ్‌ జిల్లాలో 11 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ ఐ.బంగ్‌లాంగ్‌ చాంగ్‌ నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. అనుమానిత కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాని సరఫరా వెనుక ఎవరున్నారు? అనే అంశాలను సిట్‌ దర్యాప్తు చేస్తోంది.

మద్యం నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం గువాహటికి పంపించారు. మరణాలకు అసలు కారణం ఏంటో పరీక్షల తర్వాత స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. కొన్ని ఆధారాలు లభించాయని, అయితే దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున వివరాలు వెల్లడించలేమని సీనియర్‌ ఎస్పీ వెసుప్రా కెజో తెలిపారు.

మరణాల నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 19 మందిని అరెస్టు చేశారు. దాదాపు 3 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

గుర్తుతెలియని, లేబుల్‌ లేని లేదా అనుమానిత అక్రమ మద్యాన్ని తాగవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. మద్యం తాగిన తర్వాత తల తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని హెచ్చరించారు. నాగాలాండ్‌లో 1990 నుంచి మద్య నిషేధ చట్టం అమల్లో ఉంది.