రేవంత్‌ ‘నిజాయతీ గల మోసగాడు’..! కేటీఆర్‌ సంచలన వాఖ్యలు..!

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ ‘నిజాయతీ గల మోసగాడు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు.

తెలంగాణ భవన్‌లో శనివారం మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

కేసీఆర్‌ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని కేటీఆర్‌ అన్నారు. మూడేళ్లుగా కేసీఆర్‌ ప్రజల్లోకి రాకపోయినా గల్లీ గల్లీలో ఆయన పాటలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

కేసీఆర్‌ హయాంలో రైతులు నాట్లు వేసే సమయానికే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవని కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు రైతుబంధు ఇవ్వలేదని ఆరోపించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలతో పాటు హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని భావించారని కేటీఆర్‌ అన్నారు. కానీ పరిస్థితి ‘అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లు’ తయారైందని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించిన నాయకుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.

2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 28 నుంచి చేపట్టే పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.