నిత్యావసరాల ధరలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ – జనసేన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన ‘ రా .. కదలిరా’ బహిరంగ సభలో బాబు మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవాలన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందన్నారు. ఆ పార్టీ త్వరలో ఇంటికెళ్లడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జిల్లాలో ఉన్నటువంటి కాలువల్లో పూడిక తీసే కార్యక్రమాలు కూడా చేపట్టలేదని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని ఛార్జీలను పెంచేశారన్నారు. టీడీపీ హయాంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేశామన్నారు. జగన్ పాలనలో ఈ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. రాష్ట్రంలో సాగు ఖర్చు మూడు రెట్లు పెరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఫీడ్, కరెంట్ బిల్లులు భారీగా పెంచారన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి రూ.1.5కే కరెంట్ ఇస్తామని బాబు హమీ ఇచ్చారు. దీనికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తమపై ఉందన్నారు.
జగన్ సర్కార్ ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. నీరు సరిగా ఇవ్వక క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి తెచ్చారన్నారు. మేం అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆయన దుయ్యబట్టారు. తక్షణమే వైసీపీ దుష్టపాలనను అంతం చేయాలన్నారు.
జగన్ విశ్వసనీయత.. నేతి బీరకాయ చందంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతంలో కేంద్రం మెడలు వంచుతామని చెప్పారు.. వంచారా? అని ప్రశ్నించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేదన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ 9 సార్లు పెంచారని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక గుత్తేదారులను మార్చారన్నారు. అధికారులను మార్చారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారన్నారు. పోలవరానికి గ్రహణం వీడాలంటే జగన్ ఇంటికి పోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్‌వన్ కావాలన్నారు. ఆనాడు డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చానని గుర్తు చేశారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలని కోరుకున్నానన్నారు. నాకు ఇటీవల కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లోని తెలుగువారు స్పందించారని బాబు గుర్తు చేశారు. సంపద సృష్టించడం ఎలాగో మాకు తెలుసన్నారు. తాడేపల్లి గూడెంకు ఎన్‌ఐటీ తెచ్చామన్నారు. భారతీయ విద్యాభవన్ భూములు కాజేసేందుకు ఆచంట ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని బాబు ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజల నుంచి కాజేసిన ప్రతి ఆస్తినీ స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఆచంటలో రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు కట్టాల్సిందేనన్నారు. పేదల ఇంటి జాగాకు కూడా రూ.50 వేలు కప్పంకట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తాడేపల్లిలోనూ ఇదే పరిస్థితి అన్నారు. అక్కడ ఏం చేయాలన్నా అక్కడి నేతకు పన్ను కట్టాల్సిందేనని ఆరోపించారు. జగన్‌లా భీమవరం ఎమ్మెల్యే కూడా ఒక ప్యాలస్ కట్టుకున్నారన్నారు.
నరసాపురం నాయకుడు ప్రభుత్వ భూములు కాజేస్తున్నారన్నారు. అవినీతి చేస్తున్న ఈ నేతలను కూడా మారుస్తారో లేదో జగన్ చెప్పాలన్నారు. తెలుగు ప్రజలు తెలివైన వాళ్లనే పేరు అంతటా ఉందన్నారు. వైసీపీ నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. ఇప్పటికైనా చైతన్యం రాకుంటే రాష్ట్రం అంధకారమే అవుతుందన్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే ‘ రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.