పోలవరం.. ఇక శరవేగం!


అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబుకు కుడి, ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావును అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. కాగా, పోలవరం.. నీటిపారుదల విభాగం ఈఎన్‌సీ పదవులను ఒకరే నిర్వహిస్తుండటంవల్ల పనిభారం పెరిగి ప్రాజెక్టు పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ను నియమించాలంటూ జూలై 11, 2017న కేంద్ర జలవనరుల శాఖ అప్పటి కార్యదర్శి అమర్జీత్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం, పీపీఏ కూడా లేఖలు రాసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.  

కాంట్రాక్టర్‌కు దాసోహం.. 
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటువేసి మిగిలిన రూ.2,914 కోట్ల విలువైన పనులను ఫిబ్రవరి 27, 2018 నుంచి మూడు విడతల్లో నవయుగ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో అప్పటి టీడీపీ సర్కార్‌ అప్పగించింది. కాంట్రాక్టు సంస్థ ఒత్తిడి మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌ బాధ్యతల నుంచి మే 16, 2018న పోలవరం ఈఎన్‌సీని నాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థ సూచించిన వి. శ్రీధర్‌ను పోలవరం హెడ్‌ వర్క్స్‌ సీఈగా నియమించింది. ఆయనకే పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలించే క్వాలిటీ కంట్రోల్‌ విభాగం సీఈ బాధ్యతలనూ అదనంగా అప్పగించింది. పనులు పర్యవేక్షిస్తున్న సీఈకే వాటి నాణ్యతను నిర్ధారించే బాధ్యత అప్పగించడమంటే దొంగకు ఇంటి తాళం ఇచ్చినట్లు అవుతుందని అప్పట్లో అధికార వర్గాలు గగ్గోలు పెట్టినా టీడీపీ సర్కార్‌ వెనక్కు తగ్గలేదు. ఫలితంగా పోలవరం హెడ్‌ వర్క్స్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *