సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి, జగద్గురు సిద్దిలింగ రాజకేంద్ర శివాచార్య మహాస్వామిజీ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా చేశారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికీ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మల్లన్న కల్యాణం నేపథ్యంలో ఆలయాన్ని, రాజగోపురాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు పందిళ్లు వేశారు. కల్యాణ మండపంలో వీవీఐపీలు, వీఐపీ, దాతలు, భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుడి మల్లికార్జున్ ఇంట్లో వీరభద్రుని ఖడ్గం, పళ్లేరానికి ప్రత్యేక పూజలు చేసి రతి బియ్యం తీసుకొచ్చారు.
మల్లన్న కల్యాణోత్సవం చూసేందుకు భారీగా భక్తులు వచ్చారు. భక్తులతో మల్లన్న ఆలయం రద్దీగా మారింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మెడ్చేల్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. కాగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉగాది వరకు మల్లన్న ఆలయంలో రద్దీ ఉంటుందని చెబుతున్నారు.