దశాబ్దాల నిరీక్షణకు తెర.. విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు..

దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు పట్టాలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్‌ 19న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు అందించనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులు కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 11 మండలాల పరిధిలో 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదని.. ఇళ్లపై కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కు కల్పించే కీలక ఘట్టమని చంద్రబాబు అన్నారు. పట్టా ద్వారా కుటుంబాలకు ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ హక్కు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణతో ఏళ్లుగా హక్కుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఊరట లభించనుంది. సెప్టెంబర్‌ 19న విశాఖలో చంద్రబాబు లబ్ధిదారులకు పట్టాలు, కన్వేయన్స్‌ డీడ్లు అందించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 

విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తూనే సామాన్య కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.