రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన జన్వాడ ఫామ్‌హౌస్ వివాదంపై దాని యజమాని ప్రదీప్ రెడ్డి స్పందించారు. ఆ ఫామ్‌హౌస్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి సంబంధం లేదని, అది తన వ్యక్తిగత ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ఫామ్‌హౌస్‌ను సందర్శించాలని యోచిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, “జన్వాడలోని ఫామ్‌హౌస్ భూమి నాది. కేటీఆర్, నేను చిన్ననాటి స్నేహితులం. ఆ ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చాను. అంతకుమించి దీనితో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు” అని తెలిపారు. ఆ భూమికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవని, అన్ని పత్రాలు చట్టబద్ధంగా, సక్రమంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి గానీ, సంబంధిత అధికారులకు గానీ ఏవైనా అనుమానాలు ఉంటే, తనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని ప్రదీప్ రెడ్డి సూచించారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, ప్రైవేట్ ఆస్తి వద్దకు రాజకీయ నేతలు వచ్చి తనిఖీలు చేయడం, దీనిని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టప్రకారం జరిగే ఎటువంటి విచారణకైనా తాను పూర్తిగా సహకరిస్తానని ప్రదీప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.