వైసీపీలో మొదలవుతున్న ధిక్కార స్వరం.. జగన్ రెడ్డినే వ్యతిరేకిస్తున్న నేతలు..

మునుపెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీలో .. ఇంత కాలం అధికారపక్షంలో జగన్ వన్ మాన్ షో నడుస్తూ వచ్చింది .. ఆయనను కలవడమే పార్టీ ప్రజాప్రతినిధులకు గగనమయ్యేది .. ఏదైనా చెప్పుకోవాలంటే వారికి సజ్జల, వైవీ, విజయసాయి వంటి వారే దిక్కయ్యే వారు .. వారి ముందు కూడా ఎమ్మెల్యే, ఎంపీలకు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు… అయితే ఇప్పుడు ఏకంగా జగన్ ముందే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు పలువురు నేతలు .. నియోజకవర్గం మారమని జగన్ చెప్తున్నా నో చెప్పేస్తున్నారు.. నమ్మితే నట్టేట ముంచుతున్నారు.. జగన్‌కో దండం అంటూ వెళ్లిపోతున్నారు.

 

సిట్టింగులు, ఇన్‌చార్జుల మార్పులుచేర్పుల వ్యవహారం వైసీపీలో అగ్గి రాజేస్తోంది.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పేనే సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు … వైఎస్‌ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా? మీకో దండం.. అంటూ తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్ వైపు తిరిగి సెల్యూట్‌ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు … అవమానాలను దిగమింగుకుని వెళుతున్నానని .. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తాను, తన భార్య పోటీ చేసి తీరతామంటూ జగన్‌కు కాపు సవాల్ విసిరారు.

 

మిగిలిన వైసీపీ నేతల్లా ప్రతిపక్ష పార్టీ వారిని నీచంగా తిడితేనే టికెట్‌ ఇస్తామంటే.. తనకు అవసరం లేదని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ అధిష్ఠానానికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కాదు కదా.. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు … ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే వాయిస్ పెంచుతుండటం గమానర్హం .. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లూ తిరిగాం.. మీరు చెప్పిందల్లా చేశాం.. అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు.

 

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తాజాగా సీఎం జగన్‌ను కలిశారు. ఆయన్ని ఈ సారి గుంటూరు లోక్‌సభ స్థానానికి మారమని జగన్ చెప్పారట .. నరసరావుపేటలో బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు జగన్ చెప్పారట … దాంతో అసహనానికి గురైన శ్రీకృష్ణ దేవరాయలు.. గుంటూరుకు మారే ప్రసక్తే లేదని.. నరసరావుపేటలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలిసింది. మారాల్సిందేనని సీఎం అనడంతో .. గుంటూరు పరిధిలో రాజధాని అమరావతి ఉంది. అమరావతిని ఏం చేశారు? ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అక్కడి రైతులు, జనం నిలదీస్తున్నారు. ఏం సమాధానం చెబుతామనిని ఎంపీ నిర్మొహమాటంగా చెప్పేశారంట.. ఆ క్రమంలో తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు సమాచారం.

 

ప్రకాశం జిల్లా దర్శిలో సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్థానంలో ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో వేణుగోపాల్‌ సీఎంను కలిసి మాట్లాడారు. ఆ క్రమంలో రెండు మూడు నియోజకవర్గాల ప్రతిపాదనలను సీఎం ఆయన ముందు పెట్టారట. అందుకు ఎమ్మెల్యే కూడా తన ప్రతిపాదనలను సీఎం ముందు పెట్టారట. వాటి గురించి ఆలోచిస్తే.. తానూ సీఎం ప్రతిపాదనలపై ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం… మద్దిశెట్టి సీఎంను కలిసి బయటకు వచ్చాక.. టికెట్‌ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తానని మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.

 

 

అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును జగన్ పిలిపించుకుని మాట్లాడారు … మళ్లీ ఆలోచించుకోవాలని … టికెట్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని అని సీఎం ఆయనకు చెప్పారంటున్నారు … దానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి బద్ధుడినై ఉంటానని చెప్పిన రాంబాబు .. అదే సమయంలో తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని, వాటిపై తగిన సమయంలో స్పందిస్తానని బాంబు పేల్చారు … ఆయన వైశ్య సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి… వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచి ఆ కుటుంబం వెంటే ఉంటూ వస్తున్న సీనియర్ నేత .. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు, ఇతర కేసుల్లో జగన్‌ వెన్నంటే ఉంటూ.. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ప్రయాణం సాగించిన ఆయన జగన్‌కు గుడ్‌బై చెప్పేశారు … వైసీపీ టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా సరే కళ్యాణదుర్గం నుంచి తాను … రాయదుర్గం తన భార్య గెలిచి చూపిస్తామని ముఖ్యమంత్రికే సవాలు విసిరారు .

 

సీనియర్‌ని అయిన తనకు మంత్రిపదవి ఇస్తానని ఇవ్వకపోగా.. ఇప్పుడు టికెట్‌ కూడా ఎగ్గొట్టడం, రోజంతా వేచిచూసినా సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు … వాస్తవానికి ఆయన బీసీ వర్గానికి చెందినవారు … ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టి రాయదుర్గం టికెట్‌ను జగన్ సొంత సామాజికవర్గానికి చెందినవారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు… ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఓఎంసీలో పనిచేసిన శ్రీనివాసరెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒకరికి ఖరారు కావచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

 

మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇప్పుడు నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను మార్చాలని వేమిరెడ్డి అడిగినా … మార్పులు చేసేందుకు సీఎం అంగీకరించలేదట…. దాంతో ఆయనా ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది… ఇవి చాలదన్నట్లు టికెట్ విషయమై ఆగ్రహంతో ఉన్న కొందరు నేతలు ముఖ్యమంత్రికి బంధువైన మాజీ మంత్రి బాలినేనిని కలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట.. అలా కలిసిన వారిలో ఒక సిట్టింగ్ ఎంపీ వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారంట… మొత్తానికి జగన్‌ పార్టీలో అభ్యర్ధుల మార్పులు చేర్పుల తతంగం రాజకీయ సమీకరణలను పెద్దఎత్తున మార్చేసే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *