అన్ని శాఖలపై సీఎం రేవంత్ పట్టు.. పరిపాలనపై సమగ్ర దృష్టి…

రేవంత్ రెడ్డి సీఎం అయిన నెల రోజుల్లో క్షణం తీరిక లేకుండా పని చేశారు. అన్ని శాఖల్లో వాస్తవ పరిస్థితులపై అవగాహనకు వచ్చారు. ప్రధాన శాఖలపై సమీక్ష నిర్వహించారు. అన్ని డిపార్ట్ మెంట్లపై పట్టు పెంచుతున్నారు. ఎక్కడ ఏ లోటు ఉందో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, రియల్ ఎస్టేట్ పురోగమించడం, పెండింగ్ నిధులు రావడం, శాంతిభద్రతలు బాగుండడం, పేదలందరికీ సంక్షేమం అందడం ఇదే అజెండాగా పని చేస్తున్నారు.

 

డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. ఈ దూకుడును చూసి చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాన్ స్టాప్ గా రంగంలోకి దిగడం, రివ్యూలు చేయడం, దిశానిర్దేశం ఇవ్వడం ఇవన్నీ మామూలుగా అయ్యేవి కావు. ఇది వరకటి సీఎంలు కూడా ఇంత స్పీడ్ మెయింటేన్ చేయలేదు. అందుకే అందుకే సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులకు ఇదో కొత్త అనుభవం. అయితే తన యాక్టివ్ నెస్ తో పనులను సులువుగా చక్కబెట్టేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

ఈ నెల రోజుల్లో అన్ని రంగాలపై సమీక్ష చేసి కవర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న బాక్సర్ నిఖత్ జరీన్ కు 2 కోట్ల నజరానా ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు ఈ సహాయం చేశారు. తమ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తుందన్న సంకేతాన్ని అదే రోజు యువ క్రీడాకారులకు అందించారు రేవంత్.

 

రాష్ట్రం శాంతియుతంగా, డ్రగ్స్ ఫ్రీగా ఉంటే చాలా పెట్టుబడులు, ఆరోగ్యకరమైన సమాజానికి తోడ్పడుతుందని సీఎం గ్రహించారు. అందుకే పోలీస్ శాఖలో సమూల ప్రక్షాళన చేశారు. సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇచ్చారు. టీఎస్ న్యాబ్ ను మరింత బలోపేతం చేశారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని సమీక్ష సందర్భంగా సీఎం చెప్పారు. ఇదే విషయం అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకటించారు. డ్రగ్స్ స్మగ్లర్లు ఎంత వారైనా విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టులు చేసేందుకు పరికరాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతామన్నారు.

 

ప్రస్తుతం విద్యాశాఖ తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం రేవంత్. ఈ శాఖలో చాలా ప్రక్షాళన జరగాల్సి ఉందని భావించారు. నిజానికి గత సర్కార్ హయాంలో విద్యారంగంలో రాష్ట్రం వెనుకబడి ఉందని గుర్తించారు. దీంతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా కార్యాచరణ మొదలు పెట్టారు. అత్యున్నత ఫలితాలు రావాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించారు. ప్రైవేటుకు పోటీగా తయారవ్వాలన్నారు. మూసిన స్కూళ్లను తెరిపించడం.. మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన అయ్యాక పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే యూపీఎస్సీ విధానంపై స్టడీ చేశారు.

 

మరోవైపు కీలకమైన భూ సమస్యలపైనా రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. ధరణిపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు ధరణి రద్దు చేసి భూమాతగా మార్చుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ధరణి లోపాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు ఎలా చేతులు మారాయో దర్యాప్తు జరుగుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ దగ్గరున్న వివరాలతో సరిపోల్చుతున్నారు. దీంతో ఈ పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ చేతి నుంచి ప్రభుత్వ సంస్థకు మార్చే కార్యక్రమం జరుగుతోంది.

 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చులు చేయబోమని ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ కాన్వాయ్ లో తన సొంత వాహనాన్నే సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారు. ఆర్థిక శాఖ సమీక్షలో అప్పులు దాచి ఆదాయ వ్యయాలు భూతద్దంలో చూపవద్దని అధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు మెట్రో అలైన్ మెంట్ లో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర నిధులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు రేవంత్. తక్కువ ఖర్చుతో చాలా మందికి ఉపయోగపడేలా మెట్రో లైన్ మార్చుతున్నారు. మరోవైపు రాజేంద్రనగర్ లో హైకోర్టుకు వంద ఎకరాల స్థలం కేటాయించారు. విశాలమైన హైకోర్టు భవన నిర్మాణంతో పాటే… ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునేందుకు అవకాశాలు పెంచబోతున్నారు.

 

సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రాజ్ భవన్ తో సీఎం సత్సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారు. మంచి సంప్రదాయానికి రేవంత్ రెడ్డి తెరతీశారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా రాజ్ భవన్ వెళ్లి మరీ గవర్నర్ తమిళిసైకి విష్ చేశారు. పరిపాలన సరిగా జరిగేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ పెట్టారు రేవంత్. పోస్టింగ్ లకు నిజాయతీ పనితీరే కొలమానం అని సూటిగానే చెప్పేశారు. మరిన్ని గంటలు పని చేసేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. పరిశ్రమల కోసం స్పెషల్ అటెన్షన్ తో సీఎం రేవంత్ ఉన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టులపై కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ కోసం ముందుకొచ్చిన టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. HMDA సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అలాగే తక్కువ ఖర్చుతో మూసీ సుందరీకరణ ఎలా అన్న యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయిస్తున్నారు సీఎం.

 

ఎంత సంపాదించామన్నది కాదు.. సమాజానికి ఎంత పంచాం అన్నదే ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చారు రేవంత్. సామాన్యుడూ ఎమ్మెల్యే కావొచ్చు అని అంబేద్కర్ కాలేజ్ ఉత్సవం సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక పార్టీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలకు రేవంత్ రెడ్డి కారణమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ చేసేలా పీసీసీ తీర్మానం చేసి పంపారు. ఈ ఆలోచన ఏ రాష్ట్రంలోనూ ఎవరూ చేయలేదు. సోనియాగాంధీ ఇమేజీతో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చన్న ఆలోచనతో ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవడంతో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీలోని జానారెడ్డి వంటి సీనియర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు.

 

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా, మంత్రుల్లోనూ, ఎమ్మెల్యేలలోనూ అసమ్మతి మొదలయ్యేది. ఢిల్లీకి వెళ్లి సీఎంపై అధిష్ఠానానికి చెప్పే పరిస్థితి ఉండేది. ఈ సంస్కృతికి రేవంత్ చెక్ పెడుతూ, తన నిర్ణయాలకు ముందుగానే హైకమాండ్ అనుమతి తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఎక్కడా అసంతృప్తి లేకుండా పెద్దల అనుమతి తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో చాలా మంది రేవంత్ కంటే వయసులో పెద్దవారు ఉన్నారు. వారందరికీ సముచిత గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు రేవంత్ ప్రభుత్వానికి ఒక సవాల్ అనే చెప్పాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరపడం, సంపద సృష్టి ఇవన్నీ కీలకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *