కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేడు అత్యంత వైభవంగా ఈ వేడుక జరగనుంది. రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. మల్లన్న కళ్యాణానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి మహాస్వామి పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువు జరపనున్నారు. ఈ సందర్భంగానే శనివారం రాత్రి దేవస్థాన సిబ్బంది, ఆలయ అర్చకులు కొమురవెల్లి గ్రామంలో ఊరేగింపుగా వాడవాడలా తిరిగి బియ్యం సేకరించారు.
ఆలయ సంప్రదాయం మేరకు వధువులు మేడలాదేవి, కేతమ్మదేవి తరఫున మహాదేవుని వంశస్తులు మల్లికార్జున్ దంపతులు కన్యాదానం చేయనుండగా.. వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు మల్లికార్జున్ దంపతులు స్వీకరించనున్నారు. కాగా ఉదయం 10 గంటల 45 నిమిషాలకు స్వామి వారి కళ్యాణ వేడుక జరగనుంది. ఈ ఈ క్రమంలోనే ఈరోజు వేకువ జామున ఐదు గంటలకు స్వామి వారికి దృష్టికుంభం నిర్వహించగా.. మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం.. రాత్రి ఏడు గంటలకు రథోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక స్వామి వారి కళ్యాణోత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అందుకు గాను 60వేల లడ్డూ ప్రసాదాలతో పాటు ఐదు క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు తయారు చేశామని అధికారులు తెలిపారు. సుమారు 70 మంది ఉద్యోగులు.. 100 మంది వాలంటీర్లు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులే కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.