నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించనున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘ఆయా షేర్’, ‘యేశ నాగుల కట్టమీద’ వంటి మాస్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల విడుదల తేదీపై వస్తున్న పుకార్లకు చిత్రబృందం చెక్ పెడుతూ.. సెప్టెంబర్ 24న సినిమా విడుదలవుతుందని, సెప్టెంబర్ 23 రాత్రి నుంచే ప్రత్యేక ప్రీమియర్లు ఉంటాయని ప్రకటించింది.
ఇక ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ట్రైలర్ కోసం నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 18 మధ్యలో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.