సైకో పోలీస్‌గా సునీల్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ‘అనంతన్ కాడు’

ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన సునీల్.. ఇప్పుడు విభిన్న పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో మెప్పిస్తూ తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. తాజాగా సునీల్ సైకో పోలీస్ పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

కోలీవుడ్ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. నటుడు, రచయిత మురళీ గోపీ కథ అందించిన ఈ సినిమాను గోకులం గోపాలన్ నిర్మించారు. తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2025లో థియేటర్లలో విడుదలైంది. యాక్షన్, క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో విడుదలైన సమయంలో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఓటీటీ విడుదల తర్వాత మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్య ప్రధాన పాత్రతో పాటు సునీల్ పోషించిన ప్రతినాయక ఛాయలున్న పోలీస్ పాత్ర కూడా చర్చకు వస్తోంది. వరుసగా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సునీల్ తన నటనలో మరో కోణాన్ని చూపిస్తున్నాడని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.