కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చట్ట ఉల్లంఘనులపై కఠిన చర్యలు చేపట్టాయి. రాజధాని పరిధిలో నిర్వహించిన భారీ భద్రతా తనిఖీల్లో పలువురు చట్ట ఉల్లంఘనులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో వివిధ చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించిన మొత్తం 257 మందిని అరెస్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, రాజధాని పరిధిలో భద్రతా తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.