రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 8 రోజులు ప్రజాపాలన జరిగింది. 1,11,46,293 కుటుంబాల నుంచి 1,24,85,383 అర్జీలు వచ్చాయి. ఒక కుటుంబం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెప్పింది. కానీ నిబంధనల్లో స్పష్టత లేక పలు కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారు తెలిపారు.
ఐదు గ్యారెంటీ పథకాల కోసం 1,05,91,636 మంది దరఖాస్తు చేయగా.. మిగతా అవసరాలకు 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం పూర్తి అయింది. శనివారం ఒక్కరోజే ప్రజపాలనకు 16,90,000ల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన ఎనిమిది రోజుల ప్రజాపాలన సభలకు శనివారం చివరి రోజు కావటంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జనవరి 6న ఒక్క రోజే 3.22 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు 150 డివిజన్లలో 650 కేంద్రాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. మొదటి రోజు నుంచి చూస్తే.. 29 లక్షల నివాసాలు ఉన్న కాలనీలు, బస్తీల నుంచి 24.74 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అందులో ఆరు గ్యారంటీలకు వచ్చిన అర్జీలు 19 లక్షలు కాగా.. రేషన్ కార్డులు, ఇతరత్రా అభ్యర్థనలు 5.7 లక్షలు అందాయి. ప్రభుత్వ ఆదేశాలతో దరఖాస్తులు కంప్యూటరీకరణ నగరంలో ఇప్పటికే మొదలైంది. సర్కిళ్లవారీగా ఏజెన్సీలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. శిక్షణ తీసుకున్న సంస్థలకు బల్దియా సర్కిల్ ఆఫీసుల్లోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసుకుని నమోదు చేస్తారని వివరించారు. దరఖాస్తుల సమాచారం బయటకు వెళ్లకూడదన్న ఉద్దేశంతో ఆఫీసుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు.