CJPలో విభేదాలు.. కొత్తగా ‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమొక్రటిక్’ ఏర్పాటు!

నీట్ పేపర్ లీక్‌, విద్యార్థుల సమస్యలను కేంద్రంగా చేసుకుని ఏర్పాటైన ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’లో విభేదాలు తలెత్తాయి. జంతర్‌ మంతర్‌ వద్ద ఉద్యమం చేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయించేలా చేశామని పేర్కొన్న సీజేపీలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేపీపై ఆరోపణలు చేస్తూ మనీష్‌ బ్రహ్మభట్‌ ‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమొక్రటిక్ (CJP-D)’ పేరుతో కొత్త వర్గాన్ని ఏర్పాటు చేశారు.

కొత్త జాతీయ టీమ్‌లో ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు చొప్పున వాలంటీర్లు, నిరసనకారులను చేర్చాలని తాము సూచించినప్పటికీ.. సీజేపీ ఏకపక్షంగా వ్యవహరించిందని బ్రహ్మభట్‌ ఆరోపించారు. కొత్త కమిటీ ఏర్పాటు చేసే సమయంలో ఒక్క వాలంటీర్‌ను కూడా సంప్రదించలేదని విమర్శించారు. CJP-D మాత్రం పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య నిర్ణయ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు.

జంతర్‌ మంతర్‌ ఉద్యమం విజయవంతమైన తర్వాత సీజేపీ అమ్ముడుపోయిందని, రాజకీయ పార్టీగా మారిపోయిందని బ్రహ్మభట్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సీజేపీ ‘టీమ్ కేజ్రీవాల్‌’గా మారిందని విమర్శించారు. సీజేపీ కొత్త టీమ్‌లోని 12 మందిలో ఎనిమిది మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో సంబంధం ఉన్నవారేనని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకే సీజేపీ పనిచేస్తోందంటూ బ్రహ్మభట్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.