అలకలు.. బుజ్జగింపులు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రగిలిన బెజవాడ రాజకీయాన్ని కేశినేని నాని తెల్లవారు జామున మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్‌లో ప్రకటించారు. తన అవసరం పార్టీకి లేదని చంద్రబాబాబు భావించినపుడు పార్టీలో కొనసాగడం సరికాదని ఆయన ట్వీట్ చేశారు. అందుకే.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేసి.. తర్వాత పార్టీకి కూడా గుడ్ బై చెబుతానని అన్నారు. దీంతో చలికాలం తెల్లవారుజామున కూడా బెజవాడ వేడెక్కింది.
రెండు రోజులుగా విజయవాడ టీడీపీ పాలిటిక్స్ ఏపీలో హెడ్ లైన్స్‌గా మారాయి. కేశినేని బ్రదర్స్ మధ్య వార్ తారాస్థాయికి చేరింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు వస్తున్నాయని కేశినేని నాని చేసిన పోస్టుతో టీడీపీలో చర్చకు దారి తీసింది. ఓ వైపు చంద్రబాబుపై గురు భక్తి ప్రదర్శిస్తూనే.. పార్టీలో కొందరి నేతల తీరును కేశినేని నాని విమర్శించారు. కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ కన్ఫామ్ చేశారని జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో.. నాని అసంతృప్తి వెల్లగక్కారు. దీంతో.. టీడీపీ నుంచి బుజ్జగింపు నేతలు కూడా రంగంలోకి దిగారని చర్చ జరిగింది. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని కేశినేని నాని ప్రకటించారు. అటు.. బెజవాడ టీడీపీ రాజకీయంలో వైసీపీ కూడా ఎంటర్ అయింది. నానిని పొమ్మనలేక పొగపెడుతున్నారని ట్వీట్ చేసింది. ఇలా.. అలకలు, బుజ్జగింపు, సవాళ్ల పర్వం తర్వాత.. పార్టీకి గుడ్ బై చెబుతానని నాని ప్రకటించారు.