బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్‌వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది.
అంగన్‌వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )