100ఎకరాల్లో తెలంగాణా నూతన హైకోర్టు.. స్థలం కేటాయిస్తూ రేవంత్ సర్కార్ జీవో జారీ!!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోవటంలో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో శిధిలావస్థకు చేరుకున్న హైకోర్టు పాత భవనం స్థానంలో నూతనంగా నిర్మించబోయే హైకోర్టు భవనం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. .

 

ఈ మేరకు నూతన హైకోర్టు భవనానికి భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యాకలాపాలు పాత భవనంలోనే కొనసాగుతాయి. అయితే హైకోర్టు కోసం నూతన భవన నిర్మాణాన్ని చేయనున్న తెలంగాణ సర్కార్ ఆ తర్వాత పాత భవనాన్ని కూల్చివేయకుండా హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని భావిస్తోంది.

 

 

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న పనుల పురోగతికి దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి సానుకూలంగా స్పందించి, భవన నిర్మాణానికి కావలసిన 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్, బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తూ జీవో నెంబర్ 55 విడుదల చేసింది. ఇలా ఉంటే గత నెలలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధేతోపాటు పలువురు న్యాయమూర్తులు ఎం సి హెచ్ ఆర్ డి లో ముఖ్యమంత్రిని కలిశారు.

 

ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాన్ని నిర్మించాలని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయినా ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని అలాగే కొనసాగించాలని దానిని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *