తెలంగాణలో ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఆరు స్థానాల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయిన పాడి కౌశిక్ రెడ్డి హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలుపొందారు.
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఈ నాలుగు స్థానాలు ఖాళీ కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ప్రస్తుతం బలాలు బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో స్థానం దక్కే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ సీటు కోసం భారీగా పోటీ నెలకొంది. సీనియర్ల కోటాలో కొందరు, బీసీ కోటాలో మరి కొందరు, మైనార్టీ కోటాలో ఇంకొందరు తమ వంతు ప్రయత్నాలుచేస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో తనకు అవకాశం వస్తుందని అంజన్ కుమార యాదవ్ ధీమాగా ఉన్నారు.
ఇక సీనియర్ల కోటాలో జానారెడ్డి, మధుయాష్కీ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, జగ్గారెడ్డి పోటీ పడుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో కూడా ఎమ్మెల్సీ కోసం పోటీ పెరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్థానాలను త్యాగం చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి , తాటికొండ రాజయ్య కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.