ఢిల్లీ పోలీసులు గురువారం జాక్ పాట్ కొట్టారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన జావెద్ అహ్మద్ మట్టు అనే టెర్రరిస్టుని పట్టుకున్నారు. జావెద్ అహ్మద్ కశ్మీర్‌లో పలు ఉగ్రవాద దాడుల కేసుల్లో నిందితుడు. ఇతని తలపై రూ.10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. ఇతను A++ కేటగిరీకి చెందిన టెర్రరిస్టు.. అంటే ఇతను చాలా తీవ్రమైన ఉగ్రవాద ఘటనల్లో నిందితుడు. ఢిల్లీ పోలీసులు జావెద్ అహ్మద్‌ను అరెస్టు చేయగా.. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, మేగజైన్, దొంగతనం చేసిన ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)కూడా టెర్రరిస్ట్ జావెద్ అహ్మద్ కోసం చాలా కాలంగా గాలిస్తోంది. కశ్మీర్‌లోని సోపోర్ నగరానికి చెందిన జావెద్ అహ్మద్ ఉగ్రవాద దాడులు చేసి.. పోలీసులకు దొరకకుండా అండర్ గ్రౌండ్ అయిపోయాడు. జావెద్ అహ్మద్ చేసిన ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు అయిదుగురు పోలీసులు చనిపోయారు. 25 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. A++ కేటగిరీకి చెందిన టెర్రరిస్టులలో జీవించి ఉన్న ఏకైక టెర్రరిస్టు ఇతనే.
జావెద్ అహ్మద్ ఇంతకుముందు పాకిస్తాన్‌కు కూడా వెళ్లాడు. ఇటీవల కశ్మీర్ ప్రజలు చాలా మంది ఇండియాకు అనుకూలంగా మారిపోవడంతో అక్కడ దాగిఉన్న టెర్రరిస్టులకు కష్టాలు మొదలయ్యాయి. జావెద్ అహ్మద్ సోదరుడు కూడా ఇటీవల తన ఇంటిపై భారత్ జెండా ఎగురవేశాడు. ఈ మధ్య కాలంలోనే జావెద్ అహ్మద్ కశ్మీర్ వదిలి ఢిల్లీకి పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలించి పట్టుకున్నారు.