మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నప్పటికీ, మరోవైపు వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా చూపించారని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని సీలేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పేరు, బోర్డును సినిమాలో నేరుగా చూపించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. విద్యార్థినులను అధికారిక డ్రెస్ కోడ్‌లో చూపిస్తూ, హెడ్‌మాస్టర్ పాత్రను క్రూరంగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పెషల్ క్లాసుల పేరుతో ఓ విద్యార్థినిని స్థానిక ఎమ్మెల్యే వద్దకు పంపించేలా చూపించిన సన్నివేశాలు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులపై తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని వారు మండిపడ్డారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చిత్రీకరణ ఉండకూడదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు.