హైదరాబాద్‌లో నూతనంగా 800 బస్ షెల్టర్లు..

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో సరికొత్త డిజైన్లు, అత్యాధునిక హంగులతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ (జీహెచ్‌ఎంసీ) లోకేశ్‌ కుమార్‌ శనివారం (డిసెంబర్ 21) ఈ విషయాన్ని తెలిపారు. మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా నగరంలో 400 బస్‌ షెల్టర్లను మెట్రోరైల్‌ సంస్థ ఆయా మార్గాల్లో తొలగించింది. వీటిని అనువైన ప్రదేశాల్లో పునర్నిర్మిస్తామని.. వీటితో పాటు అవసరమైన మరిన్ని చోట్ల బస్ షెల్టర్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు.

ప్రధాన రోడ్లపై రద్దీని తగ్గించడానికి లింక్‌ రోడ్లను సమాంతర రోడ్లుగా అభివృద్ధి చేస్తామని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. పాదాచారుల సౌలభ్యం కోసం ఏప్రిల్‌ లోగా 800 కి.మీ. మేర పుట్‌పాత్‌లు నిర్మిస్తామని ఆయన చెప్పారు.

హోటల్‌ టూరిజం ప్లాజాలో శనివారం ‘నగర సమన్వయ సమావేశం’ నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మెట్రో పిల్లర్ల కింద వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *