చక్కెర ధరలకు రెక్కలు.. పండగ వేళ వినియోగదారులకు షాక్

పండగల సీజన్‌ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పిండివంటలు, స్వీట్ల సందడి కనిపిస్తుంది. అయితే ఈసారి పండగ తీపికి చక్కెర ధరల పెరుగుదల సెగ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంతో సామాన్య వినియోగదారులతో పాటు మిఠాయిల తయారీదారుల్లోనూ ఆందోళన నెలకొంది. ధరలు పెరగడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అవసరమైనంత చక్కెర లభించకపోవడం సమస్యగా మారింది.

మార్కెట్‌లో చక్కెర కొనుగోలుపై పరిమితులు కూడా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా, సూపర్‌మార్కెట్‌కు వెళ్లినా కొన్ని చోట్ల పరిమిత సంఖ్యలో ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని రకాల చక్కెరపై ఆర్డర్ పరిమితులు విధించారు.

ఉదాహరణకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో క్రిస్టల్ షుగర్‌ను ఒక్కో ఆర్డర్‌కు రెండు కిలోల ప్యాకెట్ల వరకు మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని బ్రాండ్ల చక్కెర ‘స్టాక్ లేదు’ అని కనిపిస్తోంది. దీంతో పండగల సమయంలో చక్కెర కొరత, పెరుగుతున్న ధరలు వినియోగదారులకు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది.