ఏపీ ఎన్నికలే టార్గెట్..

ఏపీలో కుటుంబ రాజకీయాలు ఒకవైపు.. ఓట్ల చీలిక రాజకీయాలు ఇంకోవైపు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ వార్ కాస్తా నాలుగు స్థంభాలాటగా మారిపోయింది. ఓవైపు అధికార వైసీపీ, ఇంకోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఇలా అందరూ రంగంలోకి దిగడంతో ఏపీ పొలిటికల్ సీన్ మరో లెవెల్ కు వెళ్తోంది. ఇంతకీ జగన్ – షర్మిలను తట్టుకునేలా టీడీపీ-జనసేన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి?

 

షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నట్లయ్యాయి. రాజకీయాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడుతారని సీఎం జగన్ అనగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టారు. మీకు మీరు సమస్యలు తెచ్చుకుని తమను టార్గెట్ చేయడం ఏంటన్న పాయింట్ ను తెరపైకి తెచ్చారు. అంతేకాదు.. జగన్ ను, షర్మిలను వచ్చే ఎన్నికల్లో ఒకేసారి ఫిక్స్ చేయడం ద్వారా పైచేయి సాధించాలనుకుంటున్నారు. జగన్ ఇబ్బందులు పెట్టడం వల్లే షర్మిల ఏపీ రాజకీయాల్లో వస్తున్నారన్న విషయాన్ని టీడీపీ నేత బీటెక్ రవి అంటున్నారు. నిన్నటికి నిన్న బ్రదర్ అనిల్ కుమార్ కడప ఎయిర్ పోర్ట్ లో కలవడంతో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ గ్యాప్ లో చర్చకు వచ్చిన అంశాలను చెప్పుకొచ్చారు బీటెక్ రవి. అదే సమయంలో కుటుంబ చిచ్చుకు చంద్రబాబే కారణం అన్న పాయింట్ ను వైసీపీ నేతలు వినిపిస్తున్న పరిస్థితి.

 

జగన్ – షర్మిల మధ్య కుటుంబ సమస్యలు ఉన్నాయన్నది వాస్తవం. లేటెస్ట్ గా కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి జగన్ ఇంటికి సోదరి షర్మిల వెళ్లారు. 20 నిమిషాల మీటింగ్ మాత్రమే జరిగింది. లోపల ఏం మాట్లాడారు.. తెరవెనుక ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. కార్డు ఇచ్చారు, బయటకు వచ్చారు. అన్న జగన్ ను కలిసిన ఫోటోలు కూడా ఏవీ బయటకి రాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఫిక్స్ చేయడానికి టీడీపీ, జనసేన నాయకులు వ్యూహాలు రచించాల్సి వస్తోంది. జగన్ విషయానికొస్తే, తల్లిని, చెల్లిని సరిగా చూసుకోలేదన్న పాయింట్ ను వినిపిస్తున్నారు. అంతే కాదు.. మొన్నామధ్య చంద్రబాబు పులివెందుల వెళ్లినప్పుడు అక్కడి సభలో పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందన్న పాయింట్ ను మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు అవే ఆస్తి కుటుంబ వ్యవహారాలను జనం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు.

 

సొంత కుటుంబాన్నే చక్కదిద్దుకోలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారన్న పాయింట్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అంటే వైఎస్ జగన్ కు పట్టరాని కోపం ఉంది. ఆ పార్టీని బద్ద శత్రువుగా చూస్తారు. ఎందుకంటే గతంలో ఆస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులు పెట్టించి.. 16 నెలలు జైలుపాలు చేశారన్న ఆక్రోషం ఉంది. అలాంటి పార్టీలో ఇప్పుడు చెల్లెలు చేరడంతో తట్టుకోలేకే కుటుంబాలను చీల్చి రాజకీయం చేస్తున్నారన్న మాటను జగన్ మాట్లాడి ఉంటారని అంటున్నారు.

 

ఏపీ రాజకీయాల్లో షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల రంగంలోకి దిగితే.. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయోనన్న ఆందోళనలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో అంతా జట్టుగా మారుతున్నారు. అటు బీజేపీతోనూ పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో షర్మిల ప్రచారాలు చేస్తే.. జగన్ పై వ్యతిరేకంగా ఉన్న ఓటరు వర్గంలో కొంత చీలిక వచ్చి షర్మిల వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న టాక్ నడుస్తోంది. అలా జరిగితే కొద్దో గొప్పో సీట్లలో ఎఫెక్ట్ ఉంటుందనుకుంటున్నారు. షర్మిల ఏపీ రాకపై అటు అధికార, ప్రతిపక్షాలు హైరానా పడుతున్న పరిస్థితి ఉంది.

 

ఏపీ విజభన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో ఆంధ్రాలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయన్నది హై కమాండ్ ఆలోచనగా ఉంది. వైఎస్ కూతురిగా ఏపీ ప్రజల్లో జగన్ మాదిరే తనకూ క్రేజ్ ఉండొచ్చని షర్మిల అనుకుంటున్నారు. ఏపీ పుట్టినిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని గతంలో చెప్పిన షర్మిల తెలంగాణకే పరిమితం అవుతారనుకున్నా…. అనూహ్యంగా మళ్లీ ఏపీ రాజకీయాల్లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ తనయ అనే ట్యాగ్ లైన్ తో ఏపీ ప్రజలను షర్మిల ఎంత వరకు ఆకట్టుకుంటారన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే ఎలా ముందుకు నడిపిస్తారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *