మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు శివ నిర్వాణ చిన్నారి నక్షత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమాలో ఆమె చూపించిన ధైర్యం, అంకితభావం, ఎమోషనల్ సన్నివేశాల్లో నటనను ప్రశంసిస్తూ నక్షత్ర తల్లి, అంకుల్‌ను వేదికపైకి ఆహ్వానించారు. నక్షత్ర అనుమతితో ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, తల్లిదండ్రులు కూడా వారిని ధైర్యంగా పెంచాలని సినిమాలో చెబుతుంటామని శివ అన్నారు. అయితే నక్షత్రలాంటి ధైర్యం, గట్టి మనసున్న చిన్నారిని తాను ఎక్కడా చూడలేదని ప్రశంసించారు. షూటింగ్ ప్రారంభ సమయంలో నక్షత్ర తెలుగు విషయంలో చాలా కాన్షియస్గా ఉండేదని, తప్పులు వస్తాయేమోనని భయపడేదని తెలిపారు. అందుకే తెలుగు, మలయాళం రెండూ తెలిసిన ఓ అసిస్టెంట్‌ను ఆమెతో ఉంచి ప్రతి విషయాన్ని రెండు భాషల్లో వివరించేలా చేశానని చెప్పారు.
క్రమంగా నక్షత్ర తెలుగు నేర్చుకుని డైలాగ్స్‌ను సులభంగా చెప్పడం ప్రారంభించిందని శివ తెలిపారు. అయితే కామెడీ సీన్లు, పాటలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ తండ్రికి సంబంధించిన అత్యంత భావోద్వేగ సన్నివేశం వచ్చిందని చెప్పారు. ఆ సీన్ కోసం నక్షత్రకు కొన్ని సూచనలు ఇచ్చి, తన తండ్రిని ఊహించుకుని నటించమని చెప్పినట్లు వెల్లడించారు. ఆ సన్నివేశంలో నక్షత్ర అద్భుతంగా నటించి అందరినీ కదిలించిందని, ఆమెలో ఉన్న సహజమైన నటనా ప్రతిభ, ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని దర్శకుడు శివ నిర్వాణ ప్రశంసించారు.