పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) భారీ మోసం కేసులో పరారీలో ఉన్న వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ తరఫున వాదిస్తున్న ప్రముఖ క్రిమినల్ న్యాయవాది విజయ్ అగర్వాల్ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లండన్‌లోని బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం న్యాయ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంలో గత కొన్ని రోజులుగా విజయ్ అగర్వాల్‌ను కస్టడీలో ఉంచి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అరెస్టుకు దారితీసిన పూర్తి కారణాలేంటి? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
మెహుల్ చోక్సీ కేసులో విజయ్ అగర్వాల్ కీలక న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను లండన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యవహారంపై బ్రిటీష్ అధికారులు లేదా విజయ్ అగర్వాల్ తరఫున అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.