ప్రస్తుతం దేశవ్యాప్తంగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన తర్వాత అందరు హీరోలు మల్టీస్టారర్ లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్టంరాజు తదితరులంతా మల్టీస్టారర్ చేసేవారు. 1990 దశకంలో అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడం మానుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారంతా సోలో హీరోగానే రాణించారు. రాణిస్తున్నారు.
అయితే వీరిలో చిరంజీవి, బాలకృష్ణ మినహా నాగార్జున, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా అనుకున్నారు. అతిపెద్ద సన్సేషనల్ వార్తగా ఇది నిలిచింది. నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండే ఆవుల గిరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. నైజాంలో గిరి అంటే ఒకప్పుడు టాప్ డిస్ట్రిబ్యూటర్ గా పేరుండేది. స్టార్ హీరోల సినిమాలు ఆయన అక్కడ పంపిణీ చేసేవారు.
చిరు, తారక్ కాంబినేషన్ లో సినిమా కోసం కథలను కూడా విన్నారు. పలువురు దర్శకులను పిలిపించి ప్రత్యేకంగా సిట్టింగ్స్ వేశారు. జూనియర్ కు ఆ సమయంలో ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లతో సూపర్ మాస్ ఇమేజ్ ఉండేది. ఇద్దరూ మాస్ హీరోలే కాబట్టి సినిమా తీస్తే టాప్ లేచిపోయేలా ఉంటుందనుకున్నారుకానీ సినిమా మాత్రం రాలేదు. వీరిద్దరి ఇమేజ్‌లను సమానంగా బ్యాలెన్స్ చేసే కథలు దొరకలేదు. ఒకవేళ దొరికినా సరైన దర్శకుడు దొరకలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్ఆర్ఆర్ రూపంలో తారక్, రామ్ చరణ్ కాంబోలో సినిమా రావడం విశేషం.