మంత్రి విడదల రజినీ ఆఫీస్‌ ధ్వంసం: కొత్త ఏడాది వేళ గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత ..

కొత్త ఏడాది నాడు గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై తెలుగుదేశం- జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

 

నియోజక వర్గాల మార్పుల్లో భాగంగా చిలకలూరిపేట శాసన సభ్యురాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి స్థానచలనం కలిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.

 

నేడు ఈ కార్యాలయం ప్రారంభించాల్సి ఉంది. ఈ దశలో తెలుగుదేశం- జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఆఫీస్‌పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విడుదల రజిని ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలను చించివేశారు. హంగామా సృష్టించారు.

 

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనితో గుంటూరు వెస్ట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పేరుతో అర్ధరాత్రి గుంటూరు వెస్ట్‌లో టీడీపీ- జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం వద్ద సుమారు గంటపాటు తిష్టవేశారు. వైఎస్ జగన్, విడదల రజినీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

అనంతరం మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందినీ వదల్లేదు. వారిని కొట్టారు. కార్యాలయం లోనికి దూసుకెళ్లిన అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు. వాటికి నిప్పంటించారు. రాళ్లతో అద్దాలను పగులగొట్టారు. చేతికి అందిన వస్తువులను ఆఫీస్‌పైకి విసిరేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *