టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీపై వస్తున్న ఒత్తిడి, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ఇప్పటివరకు భారత్‌కు భారీ టెస్టు సిరీస్ విజయాన్ని అందించలేకపోయినప్పటికీ.. నాయకత్వ బాధ్యతల్లో తాను ఎంతో సౌకర్యంగా ఉన్నానని గిల్ స్పష్టం చేశాడు. జట్టు ప్రదర్శనపై బయట నుంచి వచ్చే విమర్శల కంటే ఆటగాళ్ల పురోగతిపైనే తాను ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలిపాడు.
గత ఏడాది కాలంగా భారత టెస్టు జట్టు సరైన దిశలోనే ముందుకు సాగుతోందని గిల్ పేర్కొన్నాడు. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించడం, వారు బాధ్యతలు తీసుకోవడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డాడు. జట్టు పురోగతి తనకు సంతృప్తినిస్తోందని, కెప్టెన్‌గా జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు టీమిండియా ప్రిన్స్ తెలిపాడు.
ఇంగ్లండ్ పర్యటనలో గిల్ తొలిసారి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ పరాజయం చవిచూసింది. ఆ తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో గిల్ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్నప్పటికీ.. తన నాయకత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.