ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..!

అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాల రామ విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. శ్రీరాముడి అనుగ్రహంతో ఎక్కడా లోటు రాకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణానికి అపార ధనరాశి సమకూరింది. భక్తులకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు నడుస్తున్నాయి.

 

అయోధ్య వెలిగిపోతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు వారం ముందు నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో శ్రీరామజన్మభూమిలో ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపైంది. స్థానికంగా దుకాణాలు, దీపస్తంభాలు.. అన్నీ ఆధ్యాత్మిక కళను సంతరించుకొంటున్నాయి. అయోధ్య వీధుల్లోని దుకాణాలపై జై శ్రీరాం అంటూ స్వస్తిక్‌ గుర్తులతో కొత్త రంగులు వేసుకుంటున్నారు. షహదత్‌ గంజ్‌ నుంచి నయా ఘాట్‌ వరకు పునరుద్ధరించిన 13 కిలోమీటర్ల మార్గానికి రామ్‌ పథ్‌గా నామకరణం చేశారు. శ్రీరామ నామాలు ఉన్న ఫలకాలు, శంఖు చిత్రాలు, అయోధ్య ఆలయ నమూనాలను ఈ మార్గంలోని వ్యాపారులు అమ్ముతున్నారు. అయోధ్య నగరంలోని ప్రధాన రోడ్డు ధరమ్‌ పథ్‌కు ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభాల శిఖర భాగాన సూర్యుడి ఆకారంలో అమర్చిన దీపాలు రాత్రివేళ కూడా కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేశారు.

 

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరవ్వాలంటూ రామ భక్తులకు ఆలయ ట్రస్టు ఆహ్వానం పలికింది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రతిరోజూ త్రిసంధ్యకాలాల్లో హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు ప్రకటించింది. ప్రతి హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకు అవకాశం ఉండనుంది. రామజన్మభూమి అధికార వెబ్‌సైట్‌లో హారతి పాస్ కోసం అప్లై చేసుకోవచ్చు.

 

మరోవైపు అయోధ్యలో రామాలయం పూర్తవుతుండడంతో రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందనుంది. భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో అక్కడి రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించారు. దీన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు కొత్త అమృత్‌ భారత్‌, 6 వందే భారత్‌ ట్రైన్లను ప్రారంభించారు. అటు కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను కూడా జాతికి అంకితం ఇచ్చారు. వాల్మీకి ఎయిర్ పోర్టుగా నామకరణం చేశారు. 15 వేల కోట్లతో అయోధ్యలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు.

 

అయోధ్యలో తెల్లటి మకరానా పాలరాయితో నిర్మించిన గర్భగుడి సిద్ధమైంది. ఆలయం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ప్రాంగణంలో మరో ఏడు గుడులు ఉంటాయి. సుమారు 22 లక్షల ఘనపు అడుగుల రాయితో ఆలయ నిర్మాణం చేపట్టారు. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైటు, రాజస్థాన్‌ నుంచి గులాబీ రాయి సేకరించారు. నిర్మాణంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు వాడారు. జీ ప్లస్‌ 2 ఆలయంలో ప్రతి అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంటు సహా ఆధునిక సదుపాయాలన్నీ సమకూర్చారు.

 

గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేస్తారు. ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దారు. పరికర్మ మార్గ్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం గృహ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయి. రామ మందిర నిర్మాణం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చిన బంగారు, వెండి వస్తువులను ఒక ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో కరిగించి భద్రపరిచారు. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

 

గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు 900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్‌ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందని, తమ వద్ద ఇంకా 3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. విగ్రహాన్ని రామమందరంలో ప్రతిష్ఠించేందుకు ఏడు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై, ప్రతిష్ఠాపన జరిగే వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత 45 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయి.

 

జనవరి 16న వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్‌ హోమం, దశవిద్‌ స్నానం ఉంటుంది. అలాగే భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 17న ఊరేగిస్తారు. జనవరి 18న గణేశ్‌ అంబికా, వరుణ, వాస్తు పూజా కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 19న అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన జరగనుంది. జనవరి 20న సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేస్తారు. జనవరి 21న 125 కలశాలతో దివ్య స్నాన కార్యక్రమం, జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ముఖ్య కార్యక్రమాలు ముగుస్తాయి. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పీవోకేలోని శారద పీఠం ఆలయ ప్రాంగణంలోని సరస్సు నుంచి జలాన్ని సేవ్‌ శారద కమిటీ-కశ్మీర్‌ బృందం తీసుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *