డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ 7 టిప్స్ పాటిస్తే డబ్బు, సమయం రెండూ ఆదా!

నెలవారీ సరుకులు, దుస్తులు, కిచెన్‌ సామాగ్రి, గృహోపకరణాలు వంటి అనేక వస్తువులు ఒకే చోట లభించడంతో DMartలో షాపింగ్ చేయడం చాలామంది కుటుంబాల్లో సాధారణంగా మారిపోయింది. తక్కువ ధరలు, వివిధ ఆఫర్ల కారణంగా ముఖ్యంగా వారాంతాల్లో డీమార్ట్‌ స్టోర్లకు భారీగా కస్టమర్లు వస్తుంటారు. దీంతో పార్కింగ్‌ నుంచి బిల్లింగ్‌ వరకు రద్దీతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యలను చాలావరకు తగ్గించుకోవచ్చు. వీలైతే వారాంతాల్లో కాకుండా వారంలో సాధారణ రోజుల్లో షాపింగ్‌ చేయడం మంచిది. అలాగే ఉదయం స్టోర్‌ తెరిచిన వెంటనే లేదా రాత్రి రద్దీ తగ్గిన సమయంలో వెళ్లడం ద్వారా పార్కింగ్‌, బిల్లింగ్‌ క్యూలను తప్పించుకోవచ్చు. షాపింగ్‌కు వెళ్లే ముందు అవసరమైన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకోవడం కూడా సమయాన్ని ఆదా చేస్తుంది.

అంతేకాదు, ఆఫర్‌ ఉందని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకుండా ముందుగా బడ్జెట్‌ నిర్ణయించుకోవాలి. ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులను చెక్‌ చేసుకుని అవసరమైనవి మాత్రమే కార్ట్‌లో వేసుకోవడం ద్వారా అనవసర ఖర్చులను నియంత్రించవచ్చు. ముఖ్యంగా “ఆఫర్ ఉంది కాబట్టి కొనాలి” అనే ఆలోచనకు బదులుగా “నాకు నిజంగా అవసరమా?” అని ఒక్కసారి ఆలోచిస్తే నెలవారీ షాపింగ్‌ బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.