అరుదైన కోతితో విక్రమ్ వీడియో.. చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్న స్టార్ హీరో?

చియాన్ విక్రమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వివాదానికి కారణమైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయన ఓ చిన్న కోతితో ఆప్యాయంగా ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. తొలుత ఈ వీడియోను చూసిన అభిమానులు సరదాగా స్పందించినప్పటికీ, అందులో ఉన్నది సాధారణ కోతి కాదని వన్యప్రాణి సంరక్షకులు గుర్తించడంతో విషయం సీరియస్‌గా మారింది.

ఆ కోతి అంతర్జాతీయంగా రక్షణ పొందుతున్న లార్ గిబ్బన్ జాతికి చెందిన అరుదైన విదేశీ ప్రాణిగా వన్యప్రాణి సంరక్షకులు గుర్తించినట్లు సమాచారం. విదేశీ వన్యప్రాణులను పెంచడం, వాటిని కలిగి ఉండటం వంటి అంశాలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటంతో ఈ వీడియోపై చర్చ మొదలైంది. దీంతో విక్రమ్ వద్దకు ఆ జంతువు ఎలా వచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విక్రమ్ షేర్ చేసిన వీడియో ఆధారంగా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కోతి చట్టబద్ధంగా తీసుకువచ్చారా, అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు విక్రమ్‌ను అనూహ్యమైన వివాదంలోకి నెట్టడంతో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.