నటి వామికా గబ్బికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ నటించిన ‘DC’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో వామికా గబ్బిని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆమె పోషించే పాత్రకు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఆమె పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘హను-మాన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలక భాగంగా రూపొందుతోంది. వామికా గబ్బి ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తే సినిమాపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.