మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ నియామకాలపై ఫిర్యాదు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు విద్యార్థి సంఘాల వినతి

నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చేపట్టిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై విద్యార్థి సంఘ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకాల్లో రోస్టర్ విధానం, రిజర్వేషన్లను సక్రమంగా పాటించలేదని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా కార్యాలయంలో కమిషన్ ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు.

ఎలాంటి ఉద్యోగ ప్రకటన ఇవ్వకుండానే ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందాల్సిన పోస్టులను ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారని విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ మాదిగ ఆరోపించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టడం వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నియామక ప్రక్రియలో రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలు పాటించారా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని విద్యార్థి సంఘ నాయకులు కమిషన్‌ను కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.