సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలో వ్యవసాయ పొలంలో భార్యాభర్తల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. జాతీయ రహదారి వెంబడి ఉన్న ఓ పొలంలో మగ, ఆడ మృతదేహాలను ఎవరో పాక్షికంగా పాతిపెట్టినట్లు స్థానికులు గుర్తించారు. కాళ్లు, చేతులు మాత్రమే బయట కనిపించడంతో అనుమానం వచ్చిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణ రెడ్డి, స్థానిక ఎస్ఐతో పాటు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీసి ఆధారాలను సేకరించారు. అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ కూడా ఘటనాస్థలిని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాథమిక విచారణలో మృతులను మోతె మండలం బీక్యాతండాకు చెందిన బూబా, నాగుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మోతె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మృతికి గల కారణాలు, వారిని పొలంలో పాతిపెట్టింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.