హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు Steven Spielberg పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే చిత్రాల్లో ‘Jaws’ ఒకటి. 1975లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. అప్పటికి యువ దర్శకుడిగా ఉన్న స్పీల్బర్గ్, సముద్రంలో సంచరించే భారీ షార్క్‌ను పూర్తిగా తెరపై చూపించకుండానే ప్రేక్షకుల్లో భయాన్ని రేకెత్తించారు.
షార్క్ కనిపించకపోయినా దాని ఉనికిని కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, నేపథ్య సంగీతం ద్వారా ప్రేక్షకులకు అనుభూతి కలిగించారు. ముఖ్యంగా జాన్ విలియమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ విధానం ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేయడంతో పాటు, సముద్రం అంటేనే భయం కలిగించే స్థాయిలో సినిమాకు ప్రభావాన్ని తీసుకొచ్చింది.
‘జాస్’ సాధించిన భారీ విజయం హాలీవుడ్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు మోన్స్టర్, విపత్తు నేపథ్యంలో తెరకెక్కే భారీ కమర్షియల్ చిత్రాలకు మార్గం సుగమం చేసింది. ప్రేక్షకులను భయపెట్టేందుకు భారీ విజువల్స్ కంటే కథనం, సౌండ్, కెమెరా పనితనం ఎంత కీలకమో నిరూపించిన ‘జాస్’.. నేటికీ హాలీవుడ్లో ఓ క్లాసిక్‌గా నిలిచింది.