TG Mohandas Arrest: విద్యార్థుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రముఖ విశ్లేషకుడు అరెస్ట్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రైట్‌వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్‌దాస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఆయన నివాసంలో ఆదివారం రాత్రి తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం సోమవారం ఉదయం ఆయన అరెస్ట్‌ను అధికారికంగా నమోదు చేసినట్లు తెలుస్తోంది.

విద్యార్థుల ఆందోళనపై మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించడంతో కేరళవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. విద్యార్థుల నిరసనలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగానూ దుమారం రేగింది.

ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్‌దాస్ వ్యాఖ్యలపై నమోదైన ఫిర్యాదులు, వాటి ఆధారంగా తీసుకున్న చట్టపరమైన చర్యలపై అధికారులు తదుపరి వివరాలను వెల్లడించాల్సి ఉంది.